– వైసీపీకి ప్రజాదరణ పెరుగుతున్న నియోజకవర్గాల్లో ముఖ్యనేతలపై కక్ష సాధింపు సరికాదు
– స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ అరాచకాలు అడ్డుకున్నందుకే అక్రమ కేసులు బనాయించారు
– ఓ మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు
– నేను, మా నాయకులుగానీ, కార్యకర్తలుగానీ ఏనాడూ ఏ ఆడబిడ్డను అగౌరవ పరచలేదు
– వైఎస్‌సీపీలో మహిళలను గౌరవించే సంస్కృతి ఉంది
– పార్టీ అధినాయకత్వం నుంచి జిల్లా నాయకులు, పార్టీ లీగల్ టీం అంతా మాకు అండగా నిలిచారు
– నియోజకవర్గంలో వైసీపీ నాయకులు గ్రామానగ్రామాన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు వాస్తవాలు వివరించారు
– ఆమదాలవలస బార్ అసోసియేషన్ అంతా నాకు వెన్నుదన్నుగా నిలిచింది
– కష్టకాలంలో తోడున్న ప్రతీ ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు
– విలేకరుల సమావేశంలో వైఎస్ ఆర్‌సీపీ ఆమదాలవలస నియోజకవర్గ ఇన్‌చార్జ్ చింతాడ రవికుమార్

తెలుగు జ్యోతి న్యూస్ శ్రీకాకుళం:
వైఎస్ ఆర్‌సీపీ నాయకులకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక అటు నాయకులను, అటు కార్యకర్తలను భ్రయబ్రాంతులు చేయాలన్న భ్రమలో కూటమి నేతలు అక్రమ కేసులు బనాయించి అరెస్టులకు పాల్పడుతున్నారని, ఇటువంటి అక్రమ అరెస్టులతో వైఎస్ ఆర్‌సీపీ నాయకులను అడ్డుకోలేరని వైఎస్ ఆర్‌సీపీ ఆమదాలవలస నియోజకవర్గ ఇన్‌చార్జ్ చింతాడ రవికుమార్ అన్నారు. బెయిల్‌పై బయటకు వచ్చిన చింతాడ రవికుమార్ రూరల్ మండలం పెదపాడులో ఉన్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు క్యాంపు కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీకి ప్రజాదరణ పెరుగుతున్న నియోజకవర్గాల్లో ముఖ్యనేతలపై కక్ష సాధింపు చర్యలు చేపడుతూ పోలీసులతో అరెస్టు చేయించి జైళ్లకు తరలించి కూటమి నాయకులు రాక్షసానందం పొందుతున్నారన్నారు. గత నెల 30న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు జిల్లాకు చేరుకున్న జగన్‌మోహనరెడ్డికి ఆహ్వానం పలికేందుకు కొత్తరోడ్డు ప్రాంతానికి లక్షలాది మంది చేరుకున్నారన్నారు. ఆమదాలవలస నియోజకవర్గం నుంచి వేలాది మంది తరలిరాగా అక్కడ విధుల్లో ఉన్న మహిళా ఎస్సైని పక్కకు తప్పుకోవాలని అనారోగ్యంతో ఉన్నందున ఇబ్బంది పడతారని ఆమెకు వివరించారన్నారు. ఇక్కడ ఎటువంటి ఘటన జరగక పోయినా ఏదో జరిగిందని పని గట్టుకుని ఓ మహిళ ఆత్మగౌరవం దెబ్బతీసేలా అక్రమ కేసులను బనాయించారన్నారు. కూన రవికుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్‌ల వద్దకు వెళ్లి తన నియోజకవర్గంలో వైసీపీ బలపడుతోందని తక్షణమే అక్కడి ఇన్‌చార్జ్‌ను అరెస్టు చేయించాలని మొరపెట్టుకుంటే తనపై అక్రమ కేసు బనాయించి జైలుకు తరలించారని తెలిపారు. కూన రవికుమార్ భూదందాలు, ఇసుక దోపీడీని నిలదీస్తున్నందుకే కక్ష పూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. మహిళా ఎస్సై తమ ఇంటి ఆడబిడ్డ అని, ఆమెపై ఎవరూ ఎటువంటి దాడీ చేయలేదని వివరించారు. మహిళలను అగౌరవ పరిచే పరిస్థితి వైఎస్ ఆర్‌సీపీలో లేదని తెలిపారు. తనపై, తనతో పాటు మరో 27 మందిపై కేసులు బనాయించిన నుంచి పార్టీ అధిష్టానం, జిల్లా నాయకులు, పార్టీ లీగల్ టీం అంతా తమకు అండగా నిలిచారని చెప్పారు. కూన రవికుమార్ మాట్లాడుతూ అరెస్టు అయిన వారిలో గంజాయి, డ్రగ్స్ బ్యాచ్ ఉన్నారని చెప్పడం సరికాదని, తమకు పరీక్షలు నిర్వహించి అలాంటి వారు ఉన్నారని రుజువు చేస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటారని సవాల్ విసిరాదు. అంతా విద్యార్థులు, యువత ఉన్నారని ఈ సందర్భంగా వివరించారు. ముఖ్యంగా ఆమదాలవలస బార్ అసోసియేషన్ న్యాయవాదులు తనకు అండగా ఉన్నారని అన్నారు. తాను 20 రోజులు జైలులో ఉన్నప్పటికీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తమకు వెన్నుదన్నుగా ఉంటూ అన్ని మండలాల్లోని గ్రామగ్రామానికి వెళ్లి వాస్తవాలు వివరించారని తెలిపారు. ఈ సందర్భంగా కష్టకాలంలో తమకు అండగా ఉన్న ప్రతీ ఒక్కరికీ హృదయ పూర్వక కృతజ్ఞతలు రవికుమార్ తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, సీదిరి అప్పలరాజు, ఆమదాలవలస మాజీ మున్సిపల్ చైర్మన్ బొడ్డేపల్లి రమేష్, నియోజకవర్గ ఇన్‌చార్జ్ లు శ్యామ్‌ప్రసాద్, పేరాడ తిలక్, కార్పొరేషన్ చైర్మన్లు అంధవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్‌లతో పాటు కిల్లి సత్యన్నారాయణ, కోణార్క్ శ్రీను, మండవిల్లి రవి తదితరులు పాల్గొన్నారు.