TELUGU JYOTHI
Newspaper Banner
Date of Publish : 08 July 2026, 11:54 am Posted by : TELUGU JYOTHI DESK

జూలై 10న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపు

విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం AIFDS ఆందోళన

తెలుగుజ్యోతి , బ్యూరో: 08 జులై :

తెలంగాణలో విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని AIFDS గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి ముత్తనగారి శ్రీకాంత్ ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది కొరత, మౌలిక వసతుల లేమి, హాస్టళ్లలో దయనీయ పరిస్థితులు, స్కాలర్‌షిప్-ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీ, విద్యార్థుల భద్రత వంటి సమస్యలు పేరుకుపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూలై 10న కెజి నుండి పీజీ వరకు రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈ బంద్‌లో ప్రధాన డిమాండ్లు: ఖాళీ పోస్టుల భర్తీ, మౌలిక వసతుల కల్పన, హాస్టళ్లలో నాణ్యమైన భోజనం-తాగునీరు-వైద్యం, ఫీజు రీయింబర్స్‌మెంట్-స్కాలర్‌షిప్ బకాయిల విడుదల, ప్రైవేట్ ఫీజు నియంత్రణ, మహిళా విద్యార్థుల భద్రతకు ICC కమిటీల ఏర్పాటు, విద్యార్థి సంఘాల ఎన్నికలు, కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యల పరిష్కారం, NEP-2020 అమలు నిలిపివేత.

ఈ బంద్‌ను విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజలు సహకరించి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమస్యలు పరిష్కరించకుంటే భవిష్యత్తులో మరింత ఉగ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.