TELUGU JYOTHI
Newspaper Banner
Date of Publish : 21 June 2026, 10:25 am Posted by : TELUGU JYOTHI DESK

ప్రముఖ సినీ నిర్మాత, రాజకీయ నాయకుడు గొట్టిముక్కల పద్మారావు కన్నుమూత


ప్రముఖ సినీ నిర్మాత, రాజకీయ నాయకుడు గొసినీ, రాజకీయ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పద్మారావుకు నివాళుల వెల్లువ

తెలుగుజ్యోతి – కూకట్‌పల్లి, జూన్ 21:

ప్రముఖ సినీ నిర్మాత మరియు రాజకీయ నాయకుడు గొట్టిముక్కల పద్మారావు ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఉన్న తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

1954 నవంబర్ 8న జన్మించిన పద్మారావు చిన్ననాటి నుంచే సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. ఆ ఆసక్తితోనే “పద్మప్రియ ఆర్ట్స్” బ్యానర్‌ను స్థాపించి పలు విజయవంతమైన తెలుగు చిత్రాలను నిర్మించారు. 1985లో సుమన్ హీరోగా వచ్చిన ‘కంచుకవచం’ చిత్రం ఆయన నిర్మాణంలో తెరకెక్కింది. ఈ చిత్రంలో ఆయన స్వయంగా పోలీస్ పాత్రలో కూడా కనిపించారు.

1986లో సీఎస్ రావు దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీ వేమన చరిత్ర’ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించారు. అనంతరం 1991లో రాజేంద్ర ప్రసాద్ హీరోగా వంశీ దర్శకత్వంలో రూపొందిన ‘ఏప్రిల్ 1న విడుదల’ చిత్రం నిర్మించి భారీ విజయాన్ని అందుకున్నారు. 1996లో ‘జోకర్’ సినిమాను నిర్మించారు. 2006లో వచ్చిన ‘నీ నవ్వే చాలు’ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించారు.

వ్యక్తిగతంగా ఆయనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారిలో పెద్ద కుమార్తె సుజనా రావు ‘గమనం’ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం.

రాజకీయ ప్రస్థానం

సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ పద్మారావు చురుకుగా పాల్గొన్నారు. 1970లలో జరిగిన తెలంగాణ తొలి ఉద్యమంలో పాల్గొని జైలుశిక్షను కూడా అనుభవించారు. తర్వాతి దశ ఉద్యమాల్లోనూ ఆయన చురుకుగా వ్యవహరించారు.

1996లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన, తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్‌లో చేరారు. 2014లో కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా ఓటమి చెందారు. అనంతరం 2018లో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

గొట్టిముక్కల పద్మారావు మృతి సినీ, రాజకీయ రంగాలకు తీరని లోటుగా భావిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులు, సన్నిహితులు ప్రార్థిస్తున్నారు.