మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో చివరి దశ కాలేయ క్యాన్సర్ రోగికి విజయవంతమైన చికిత్స
తెలుగుజ్యోతి, బ్యూరో :11 జూలై:
ఒకప్పుడు చివరి దశ (మెటాస్టాటిక్) కాలేయ క్యాన్సర్‌గా నిర్ధారణ అయితే చికిత్స అవకాశాలు చాలా పరిమితంగా ఉండేవి. అయితే ఆధునిక ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీ అందుబాటులోకి రావడంతో అలాంటి రోగుల్లోనూ ఆశాజనక ఫలితాలు సాధ్యమవుతున్నాయని మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ & హీమాటో-ఆంకాలజిస్ట్ డా. ఎ. వేణుగోపాల్ తెలిపారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌కు చెందిన జయలక్ష్మి (56) కుడి ఛాతీ భాగంలో తీవ్రమైన వాపు, నొప్పితో మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ను ఆశ్రయించారు.
వైద్యులు నిర్వహించిన MRI, FNAC, PET-CT వంటి పరీక్షల్లో ఆమెకు హెపాటోసెల్యులార్ కార్సినోమా (కాలేయ క్యాన్సర్) ఉన్నట్లు, అది కాలేయం నుంచి కుడి 7వ పక్కటెముక, D10 వెన్నెముక వరకు వ్యాపించినట్లు గుర్తించారు.
రోగి పరిస్థితిని సమగ్రంగా పరిశీలించిన వైద్య బృందం అత్యాధునిక Atezolizumab ఇమ్యునోథెరపీతో పాటు Bevacizumab టార్గెటెడ్ థెరపీను ప్రారంభించింది. వరుసగా ఆరు సైకిళ్ల చికిత్స అనంతరం నిర్వహించిన PET-CT స్కాన్‌లో వైద్యులను సైతం ఆనందపరిచే ఫలితాలు నమోదయ్యాయి.
పరీక్షల్లో కాలేయంలో క్రియాశీల క్యాన్సర్ పూర్తిగా కనిపించకపోవడంతో పాటు, పక్కటెముక మరియు వెన్నెముకకు వ్యాపించిన క్యాన్సర్ కూడా గణనీయంగా తగ్గినట్లు వెల్లడైంది. ఈ ఫలితాల నేపథ్యంలో రోగికి ఏడో సైకిల్ చికిత్సను విజయవంతంగా అందించారు. చికిత్స సమయంలో ఎలాంటి తీవ్రమైన దుష్ప్రభావాలు లేకుండా రోగి చికిత్సను బాగా తట్టుకుని ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు.
ఈ సందర్భంగా డా. ఎ. వేణుగోపాల్ మాట్లాడుతూ, “చివరి దశ కాలేయ క్యాన్సర్ అంటే ఇక ఆశ లేదనే భావన చాలామందిలో ఉంటుంది. కానీ ఆధునిక ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీ వల్ల అలాంటి పరిస్థితుల్లో కూడా క్యాన్సర్‌ను సమర్థవంతంగా నియంత్రించే అవకాశాలు గణనీయంగా పెరిగాయి. ప్రతి రోగికి ఒకే విధమైన చికిత్స ఉండదు. క్యాన్సర్ రకం, దశ, రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి సరైన చికిత్సను ఎంపిక చేస్తాం. అందువల్ల లక్షణాలు కనిపించిన వెంటనే నిపుణులను సంప్రదించి చికిత్స ప్రారంభిస్తే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయి,” అని తెలిపారు.