TELUGU JYOTHI
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 12:34 pm Posted by : TELUGU JYOTHI DESK

అక్రమ వసూళ్ల ఆరోపణలు..

మియాపూర్ సర్కిల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సస్పెండ్

వీధుల నుంచి పూర్తిగా తొలగించాలంటూ ఏజెన్సీకి లేఖ

తెలుగుజ్యోతి, శేరిలింగంపల్లి, ఆగస్టు 25:

పట్టణ ప్రణాళిక విభాగంలో అక్రమ వ్యవహారాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. మియాపూర్ సర్కిల్‌ సిటిజన్ సర్వీస్ సెంటర్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్‌కుమార్ అలియాస్ గడ్డం శ్రీనుపై వేటు పడింది.
కంప్యూటర్ ఆపరేటర్ గా విధులలో చేరి టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏండ్లుగా తిష్టవేసిన ప్రవీణ్, గతంలో పలుమార్లు ట్రాన్స్ఫర్లు అయిన చక్రం తిప్పి ఇక్కడికే చేరాడు. టౌన్ ప్లానింగ్ విభాగంలోని అధికారులను మచ్చిక చేసుకుని నిర్మాణదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. సుమారు రెండు దశాబ్దాలుగా ఇదే విభాగంలో కొనసాగుతూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు అనేక ఫిర్యాదులు అధికారుల దృష్టికి వెళ్లాయి. ఈ ఫిర్యాదులపై ఉన్నతాధికారుల ఆదేశాలతో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టి నివేదికను సమర్పించారు. నివేదిక ఆధారంగా శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ అమిత్ చర్యలు తీసుకున్నారు. ప్రవీణ్‌కుమార్‌ను విధుల నుంచి తొలగించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటుగా అతడు చేరిన ఏజెన్సీ నుంచి సైతం తొలగించాలంటూ లేఖ రాశారు. అక్రమాలకు పాల్పడే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.