TELUGU JYOTHI
Newspaper Banner
Date of Publish : 22 August 2026, 10:26 pm Posted by : TELUGU JYOTHI DESK

చందానగర్‌ పీఎస్‌లో లంచం తీసుకుంటూ ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అరెస్ట్‌

చందానగర్ , ఆగస్టు 22:(తెలుగుజ్యోతి)

చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు చేపట్టిన ఆకస్మిక దాడి కలకలం రేపింది. కేసు దర్యాప్తు, చార్జిషీట్‌ విషయంలో ఫిర్యాదుదారుడికి అనుకూలంగా వ్యవహరిస్తామంటూ లంచం డిమాండ్‌ చేసిన ఆరోపణలపై ఎస్‌ఐ బండెల బాలరాజ్‌, కానిస్టేబుల్‌ రైటర్‌ బీ. రాఘవేంద్ర ఏసీబీకి చిక్కారు.

ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన క్రైం నంబర్‌ 696/2026 కేసులో ఫిర్యాదుదారుడికి అనుకూలంగా వ్యవహరించేందుకు ఇద్దరూ కలిసి రూ.75 వేల లంచం డిమాండ్‌ చేసినట్లు తెలిపారు.

ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు శనివారం పథకం ప్రకారం దాడి నిర్వహించారు. ఈ క్రమంలో ఎస్‌ఐ బాలరాజ్‌ తన కార్యాలయంలోని టేబుల్‌ డ్రాలో రూ.75 వేల లంచం నగదును ఉంచుకున్న సమయంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

ఇదే వ్యవహారంలో ఇప్పటికే రూ.20 వేల నగదును ఎస్‌ఐ స్వీకరించగా.. మరో రూ.10 వేల మొత్తాన్ని కానిస్టేబుల్‌ రాఘవేంద్ర యూపీఐ ద్వారా తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేశారు. అనంతరం ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపరిచినట్లు తెలిపారు. కేసుపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.

పోలీస్‌ స్టేషన్‌లోనే ఏసీబీ దాడి చేసి ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ను పట్టుకోవడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది.