Friday, September 18, 2026
Homeక్రైమ్ న్యూస్మియాపూర్‌ జి ఎస్ ఎం మాల్ వద్ద హీలియం గ్యాస్ సిలిండర్‌ బ్లాస్ట్‌

మియాపూర్‌ జి ఎస్ ఎం మాల్ వద్ద హీలియం గ్యాస్ సిలిండర్‌ బ్లాస్ట్‌

📰 Generate e-Paper Clip

ఒకరి పాదం తెగిపడిన వైనం.. మరో నలుగురికి గాయాలు

ఘటన.. పేలుడు ధాటికి కారు అద్దాలు ధ్వంసం

క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన మియాపూర్ పోలీసులు

శేరిలింగంపల్లి, ఆగస్టు 8 (తెలుగు జ్యోతి):

మియాపూర్ జాతీయ రహదారి వెంట జీఎస్‌ఎం మాల్‌ సమీపంలో శనివారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బెలూన్లలో హీలియం గ్యాస్‌ నింపుతుండగా సిలిండర్‌ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఐస్‌క్రీం విక్రయిస్తున్న వ్యక్తి కుడికాలి పాదం తెగిపడగా, మరో నలుగురు గాయపడ్డారు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన అవినాష్‌ జీఎస్‌ఎం మాల్‌ వద్ద సైకిల్‌పై హీలియం గ్యాస్‌ సిలిండర్‌ పెట్టుకుని బెలూన్లు విక్రయిస్తున్నాడు. సాయంత్రం సుమారు 4.30 గంటల సమయంలో బెలూన్లలో గ్యాస్‌ నింపుతుండగా సిలిండర్‌ ఒక్కసారిగా పేలింది. పేలుడు ధాటికి సిలిండర్‌ శకలాలు పక్కనే ఐస్‌క్రీం విక్రయిస్తున్న వివేక్‌పాల్‌ కుడికాలికి తగలడంతో పాదం తెగిపడి తీవ్ర రక్తస్రావమైంది.

పేలుడు ధాటికి స్కూటీపై వెళ్తున్న కొండాపూర్‌కు చెందిన ఎం. జనార్దన్‌ కాలికి గాయాలయ్యాయి. కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్న ధనుష అనే విద్యార్థినికి స్వల్ప గాయాలయ్యాయి. షాపింగ్‌ కోసం మాల్‌కు వచ్చిన విన్నకొండ సింధూప్రియ కారులో ఉండగా పేలుడు ధాటికి కారు అద్దాలు పగిలి ఆమెకు గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న మియాపూర్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన వివేక్‌పాల్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. బెలూన్లు విక్రయిస్తున్న అవినాష్‌కు కూడా చేతికి గాయాలైనట్లు మియాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ జయరాం తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!