Tuesday, July 28, 2026
Homeఎడిటోరియల్అమీన్‌పూర్‌లో యథేచ్ఛగా అక్రమ మద్యం విక్రయాలు..! ఎక్సైజ్ శాఖ మౌనం వెనుక కారణమేంటి..?

అమీన్‌పూర్‌లో యథేచ్ఛగా అక్రమ మద్యం విక్రయాలు..! ఎక్సైజ్ శాఖ మౌనం వెనుక కారణమేంటి..?

📰 Generate e-Paper Clip

 

అమీన్‌పూర్, జూలై 25: తెలుగు జ్యోతి రిపోర్టర్ మన్నె ప్రసాద్

అమీన్‌పూర్‌లో అక్రమ మద్యం విక్రయాలపై వరుసగా ఫిర్యాదులు వస్తున్నా, వార్తలు వెలువడుతున్నా పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అర్ధరాత్రి వరకు జరుగుతున్న అక్రమ మద్యం విక్రయాలపై కథనాలు వెలువడినప్పటికీ, ఇప్పటివరకు ఎక్సైజ్ శాఖ లేదా సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదని చెబుతున్నారు.
ముఖ్యంగా అమీన్‌పూర్–బొల్లారం ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న చెరువు కట్ట ప్రాంతంలోని కొన్ని దుకాణాలు, స్క్రాప్ షాపుల్లో రాత్రి వేళల్లో అక్రమంగా మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. నిర్ణీత సమయం ముగిసిన తర్వాత కూడా కొన్నిచోట్ల బెల్ట్ షాపుల తరహాలో మద్యం విక్రయాలు జరుగుతున్నాయని, ఎంఆర్‌పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.
స్థానికుల కథనం ప్రకారం, రాత్రి వేళల్లో ఈ ప్రాంతానికి మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చే వారి సంఖ్య పెరుగుతుండటంతో రోడ్లపై గుంపులు ఏర్పడుతున్నాయని, మహిళలు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అసౌకర్యానికి గురవుతున్నారని చెబుతున్నారు. ప్రజలు అధికంగా సంచరించే చెరువు కట్ట ప్రాంతంలో ఇలాంటి పరిస్థితులు కొనసాగడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొంటున్నారు.
ఈ వ్యవహారంపై పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదని స్థానికులు అంటున్నారు. దీంతో అక్రమ మద్యం విక్రయాలపై పర్యవేక్షణ తగినంతగా జరుగుతోందా లేదా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయని చెబుతున్నారు.
తనిఖీలు ఎక్కడ..? చర్యలు ఎప్పుడు..?
అక్రమ మద్యం విక్రయాలపై ఆరోపణలు వస్తున్నప్పటికీ, ఆ ప్రాంతాల్లో ఇటీవల ప్రత్యేక తనిఖీలు నిర్వహించారా? నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే విషయాలపై సంబంధిత శాఖలు స్పష్టత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని డిమాండ్
అమీన్‌పూర్–బొల్లారం రహదారి వెంట, చెరువు కట్ట ప్రాంతంలోని దుకాణాలు, స్క్రాప్ షాపుల్లో అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై జిల్లా ఎక్సైజ్ శాఖ, పోలీసు శాఖ సంయుక్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత దుకాణాలను సీజ్ చేసి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
“అక్రమ మద్యం విక్రయాలపై వస్తున్న ఫిర్యాదుల నిజానిజాలను అధికారులు వెంటనే పరిశీలించి, ప్రజల్లో ఉన్న అనుమానాలకు స్పష్టత ఇవ్వాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి ఆరోపణలకు అడ్డుకట్ట పడుతుంది” అని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!